లాక్‌డౌన్ పొడిగిస్తారా దేశంలో ఇప్పుడిదే హాట్ టాపిక్. కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్ విధించింది. ప్రజలెవరూ ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అయితే.. లాక్‌డౌన్‌తో కరోనా కేసులు తగ్గుతాయని ఆశించగా.. రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ విషయంపై తాజాగా ఆయన సంకేతం ఇచ్చారు. ఏప్రిల్ 14 తర్వాత దేశంలో లాక్‌డౌన్‌ను ఒకేసారి మాత్రం ఎత్తేసే పరిస్థితి లేదని చెప్పారు. పార్లమెంట్ ఫ్లోర్ లీడర్లతో బుధవారం (ఏప్రిల్ 8) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా లాక్‌డౌన్‌పై సంకేతాలిచ్చారు.
ఏప్రిల్ 14 తర్వాత దేశంలో దశల వారీగా లాక్‌డౌన్ ఎత్తివేసే అవకాశం ఉందని బీజేడీ ఎంపీ పినాకీ మిశ్రా అన్నారు. లాక్‌డౌన్ ఒకేసారి ఎత్తేసే పరిస్థితి మాత్రం లేదని ప్రధాని మోదీ చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రధానితో సమావేశం అనంతరం ఆయన పీటీఐ ప్రతినిధితో మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె కేశవరావు, లోక్‌సభా పక్షనేత నామా నాగేశ్వర రావు ప్రగతి భవన్ నుంచి ఈ సమావేవంలో పాల్గొన్నారు. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కూాడా ఉన్నారు.